మధుమేహం -(ఈనాడు)05.04.2016) నుండి సేకరణ
మధుమేహాన్ని
మట్టికరిపించండి!
అపోహలను
ఛేదించండి!
మన
ప్రాంతంలో ఇప్పుడు మధుమేహంపై
శ్రద్ధ బాగానే పెరిగింది. మధుమేహులంతా
కూడా దాని గురించి ఎక్కువగానే
ఆలోచిస్తున్నారు. కానీచాలా
సందర్భాల్లో వైద్యపరమైన సమాచారాన్ని
నమ్మకుండా.. అపోహలు,అనుమానాల్లో
కూరుకుపోతూ.. అయోమయంలో పడిపోతున్నారు.
మధుమేహాన్ని జయించాలంటే ముందుగా
అపోహలను వదిలించుకోవాలి. అనుమానాల
నుంచి బయటపడాలి. అందుకే తమ అనుభవంలో
ప్రత్యక్షంగా చూసిన కొన్ని
కేసుల నేపథ్యంలో.. మన ప్రాంత
ప్రజల్లో పేరుకుపోయిన అపోహలను,
మన సమాజంలో విపరీతంగా ప్రచారంలో
ఉన్న కొన్ని దురభిప్రాయాలను
ఇక్కడ సవివరంగా చర్చిస్తున్నారు
ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు
డా॥ పి.వి.రావు
‘లైట్’గా,
‘మైల్డ్’గా.. అలాంటివేం ఉండవు!
చాలామంది
తమకు మధుమేహం ఇప్పుడిప్పుడే
‘లైట్’గా వస్తోందనీ.. ‘బోర్డర్’లో
ఉందనీ, ‘షుగరు మైల్డ్‌గా’ వచ్చిందనీ..
‘వచ్చిందిగానీ నాకు ఎప్పుడూ
కంట్రోల్‌లోనే ఉంటుందనీ’.. ఇలా
రకరకాలుగా చెప్పుకుంటూ ఏళ్లకు
ఏళ్లు నిర్లక్ష్యంతో తోసేసుకు
తిరుగుతున్నారు. ఇది ఏమాత్రం
సమర్థనీయం కాదు. ఇలా ఓ ఐదారేళ్ల
పాటు తోసేసుకుని తిరిగి.. చివరికి
మధుమేహం కారణంగా కళ్లు దెబ్బతిని,
కాళ్లు దెబ్బతిని దయనీయ పరిస్థితుల్లో
వైద్యుల దగ్గరకు వచ్చేవాళ్లు
ఎంతో మంది ఉంటున్నారు. ఇటీవలే
ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే
ఉద్యోగి ఒకరు ఇలాగే మాతో వాదించటం
మొదలుపెట్టారు. ఏదో ఒక్కసారి
రక్తంలో గ్లూకోజు ఎక్కువుందిగానీ,
ఆ మర్నాటి నుంచీ తాను డైటింగ్,
వాకింగ్ మొదలుపెట్టేసి దాన్ని
తగ్గించేసుకున్నానని చెప్పేవాళ్లు.
తనకు మధుమేహం లేదని నమ్ముతూ..
మధ్యమధ్యలో రక్త పరీక్షలు చేసి
చూసుకోవటం కూడా మానేశారు. కానీ
కొంతకాలం తర్వాత ఆయనకు జననాంగాల
వద్ద ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి
ఎంతకీ తగ్గకుండా వేధించటం మొదలుపెట్టింది.
అది బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు
వైద్యుల వద్దకు వెళితే వాళ్లు
షుగర్ పరీక్ష చేయించారు. అప్పుడు
రక్తంలో గ్లూకోజు చాలా ఎక్కువగా
ఉందని, దానివల్ల ఇన్ఫెక్షన్లు
బయల్దేరాయని తేలింది. కాబట్టి
నాకు వచ్చింది ‘మైల్డ్ షుగర్’
అనీ, ‘లైట్ షుగర్’ అనీ నిర్లక్ష్యం
చెయ్యొద్దు. అసలు అలాంటివేమీ
ఉండవు. ఎవరైనా సరే, రక్తంలో గ్లూకోజు
పరగడుపున 125 దాటినా, తిన్న తర్వాత
2 గంటలకు 200 దాటినా- తమకు మధుమేహం
వచ్చినట్టేనని గుర్తించాలి.
ఒక్కసారి అలా కనబడినా సరే, మందులు
మొదలు పెట్టాల్సిందే. దాన్ని
ఆహారంతో తగ్గించేస్తామనీ, వ్యాయామ
నియమాలతో దారిలోకి తెచ్చేస్తామనీ..
తప్పించుకుని తిరగటానికి వీల్లేదు.
ఒకప్పుడు మధుమేహాన్ని తొలిసారి
గుర్తించిన తర్వాత మూడు నెలల
పాటు ఆహార వ్యాయామ నియమాలు ప్రయత్నించండని
(నాన్ ఫార్మకలాజికల్ థెరపీస్)
చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడా
విధానం సమర్థంగా లేదని, దానివల్ల
ఉపయోగం లేకపోగా ముప్పులు ఎక్కువ
అవుతున్నాయని తేలింది. రక్తంలో
గ్లూకోజు ఒక్కసారి ఎక్కువ కనబడినా
సరే.. మందులు మొదలుపెట్టాల్సిందేననీ,
దాన్ని అదుపులోకి తీసుకురావాల్సిందేనని
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు
విస్పష్టంగా నొక్కి చెబుతోంది.
తిండితో
తగ్గించేస్తామని బయల్దేరొద్దు!
మధుమేహం
వచ్చిందనగానే చాలామంది టీ, కాఫీల్లో
పంచదార మానేస్తుంటారు. మధుమేహ
నియంత్రణకు అదొక్కటే చాలనుకుంటుంటారు.అలాగే
వరి అన్నం మానేసి చపాతీలకు మారిపోయి,
ఇక గ్లూకోజు అదే తగ్గిపోతుందని
నమ్ముతుంటారు. నిజానికి ఆహారం
తగ్గించటం వంటి చర్యలు- ఇప్పటికే
బరువు ఎక్కువగా ఉన్న మధుమేహులకు
ఉపయోగపడతాయి. వాళ్లకు అది అవసరం.
కానీ వాస్తవానికి ఇప్పుడు మధుమేహుల్లో
నూటికి 70 మంది లావుగా ఉండటం లేదు.
సన్నగానే ఉంటున్నారు. వీళ్లు
ఆహారం తగ్గించెయ్యటం వల్ల షుగర్
తగ్గటం మాట అటుంచి పోషకాహార
లోపం, దానివల్ల ఇతరత్రా సమస్యలు
ముంచుకొచ్చే ముప్పు ఉంటుంది.
తిండి తగ్గించెయ్యటం వల్ల రోగనిరోధక
శక్తి కూడా క్షీణిస్తుంది. కాబట్టి
ఆహారం తగ్గించెయ్యటం కాదు...
తినే ఆహారంలో అన్నీ తగు పాళ్లలో
ఉండేలా చూసుకోవటం ముఖ్యం. వాస్తవానికి
మధుమేహం వచ్చిన తర్వాత- దాన్ని
కేవలం ఆహారం, వ్యాయామాలతోనే
తగ్గించేస్తామని ప్రయత్నించటం
సరికాదు. ఒకాయన ఇలాగే మేం మందులు
సిఫార్సు చేసినా కూడా వేసుకోకుండా
ఆహారంతోనే తగ్గించేస్తానని
భీష్మించుకుని తిండి విపరీతంగా
తగ్గించేశారు. దానివల్ల బరువు
వేగంగా తగ్గిపోయి, మనిషి బక్కచిక్కి
పోయారు. మెల్లగా కొద్దిపాటి
జ్వరం, దగ్గు ఆరంభమయ్యాయి. మనిషి
క్షీణించిపోవటం చూసి పరీక్షించిన
వైద్యులు చివరికి ‘క్షయ’గా
నిర్ధారించి వైద్యం చెయ్యాల్సి
వచ్చింది. ఆహారం తగ్గించేస్తే
రోగనిరోధకశక్తి సన్నగిల్లిపోతుంది.
ఎప్పుడైతే రోగనిరోధక శక్తి
తగ్గుతుందో.. వెంటనే క్షయ వంటి
ఇన్ఫెక్షన్ల దాడి పెరిగిపోతుంది.
కాబట్టి మధుమేహం వచ్చిందని
నోరు పూర్తిగా కట్టేసుకుని,
ఆహారం పూర్తిగా మానెయ్యటం సబబు
కానే కాదు. మధుమేహం వచ్చినా
సరే, ఎవరైనా గానీ ఆరోగ్యకరమైన,
సమతులాహారం తీసుకోవాలి. ఆహారంలో
మాంసకృత్తులు, పిండి పదార్థాలు,
పండ్లు, కూరగాయల వంటివన్నీ సమృద్ధిగా
ఉండేలా చూసుకోవాల్సిందే. ఇప్పుడు
చాలామంది మధుమేహం వచ్చిందనగానే
ధ్యాస అంతా ఆహారం మీదే పెడుతూ,
మందులకు ఏమంత ప్రాధాన్యం ఇవ్వటం
లేదు. నిజానికి మధుమేహం విషయంలో
ఆహార వ్యాయామాల వంటివి ముఖ్యమేగానీ
వాటికంటే కూడా.. గ్లూకోజు నియంత్రణకు
వైద్యులు చెప్పినట్టుగా మందులు
వేసుకోవటం, క్రమం తప్పకుండా
పరీక్షలు చేసుకోవటం మరింత ముఖ్యం.
మందులు-పరీక్షలకు తొలి ప్రాధాన్యం.
ఆ తర్వాతే ఆహారం-వ్యాయామం! అది
కూడా అవగాహనతో చెయ్యాలి. అవసరమైతే
డైటీషియన్లు, పోషకాహార నిపుణుల
సలహా మేరకే ఆహార నియమాలు పాటించాలి.
పదేళ్లు
మోసపోవద్దు!
సాధారణంగా
మధుమేహం వచ్చిన తర్వాత మొదటి
పదేళ్ల పాటు పైకి పెద్దగా ఎలాంటి
దుష్ప్రభావాలూ ఉండవు. దీంతో
చాలామంది ఏళ్ల తరబడి మధుమేహాన్ని
పట్టించుకోకుండా తోసేసుకుని
తిరుగుతున్నారు. నాకేం సమస్యల్లేవని
పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు.
కానీ దీనివల్ల త్వరలోనే ఆరోగ్యం
ఘోరంగా దెబ్బతిని ఆపదల పాలవుతున్నారు.
సాక్షాత్తూ వైద్య కళాశాలలో
పనిచేసిన ఓ సీనియర్ ప్రొఫెసర్
విషయమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
ఆయనకు 36 ఏళ్ల వయసులోనే మధుమేహం
వచ్చింది. అయినా తనకు రక్తంలో
గ్లూకోజు మరీ ఎక్కువగా లేదనీ,
అయినా అది పెరగటానికి మధుమేహం
కారణం కాదనీ, దానికి మందులు
వేసుకోవాల్సిన అవసరం లేదనీ,
దానివల్ల తనకేం నష్టం ఉండదనీ
ఆయన చెబుతుండే వాళ్లు. వారించబోయిన
తోటి వైద్యులతో కూడా ఇలాగే
వాదిస్తుండే వారు. పైగా తన వాదనకు
సమర్థనగా రకరకాల పత్రికల్లో
వచ్చే అధ్యయనాలు, వ్యాసాలను
(తనకు అనుకూలంగా అన్వయించి)
చూపిస్తుండేవాళ్లు. ఇలా చాలా
ఏళ్లపాటు గడిపేశారు. అదృష్టవశాత్తూ
మొదటి ఏడెనిమిదేళ్ల పాటు ఆయనకు
పెద్ద ఇబ్బందులేం రాలేదు. కానీ
ఆ తర్వాత సమస్యలు మొదలయ్యాయి.
మధుమేహ దుష్ప్రభావాల కారణంగా
పదేళ్లకల్లా ఆయనకు కిడ్నీలు
విఫలమైపోయాయి. దాన్ని గుర్తించిన
ఏడాదిలోనే కిడ్నీ మార్పిడి
చెయ్యాల్సి వచ్చింది. కిడ్నీ
మార్పిడి తర్వాత కూడా ఆయన రెండు
మూడేళ్లకు మించి బతకలేదు. కాబట్టి
ఇతరత్రా సమస్యలు, లక్షణాలు లేవు
కదా అని రక్తంలో గ్లూకోజును
ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు.
ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చెయ్యటం
వల్ల శరీరంలోని రకరకాల అవయవాలు
మళ్లీ కోలుకోలేనంత తీవ్రంగా
దెబ్బతినిపోయే ప్రమాదం పొంచే
ఉంటుంది.
మతపెద్దలూ..
ఆ మాట చెప్పొద్దు!
చాలా
సందర్భాల్లో మతపెద్దలు, ధ్యాన
గురువులు- ‘మందులు మానేసెయ్యండి,
ప్రార్థనలు చేస్తే మధుమేహం
అదే తగ్గిపోతుంది, జీవితాంతం
ఆ మందులు వేసుకోవాల్సిన అవసరమే
ఉండదని’ ప్రబోధిస్తున్న దృష్టాంతాలు
తరచూ మా దృష్టికి వస్తున్నాయి.
ప్రత్యేకించి ఒక మతమని కాదు..
దాదాపు అన్ని మతాల్లోనూ ఇదే
ధోరణి కనిపిస్తోంది. ఇది ఏమాత్రం
సరికాదు. పైగా ప్రమాదకరం కూడా.
కొన్నేళ్ల క్రితం మధుమేహం వచ్చిన
ఓ చిన్నపిల్లాడిని తల్లిదండ్రులు
మా దగ్గరకు తీసుకొచ్చారు. అతనికి
మధుమేహం నియంత్రణలో ఉంచేందుకు
ఇన్సులిన్ తప్పనిసరి. ఆ విషయాన్ని
తల్లిదండ్రులకు వివరించి, వాళ్లను
ఒప్పించి, మందులిచ్చి పంపాము.
కానీ ఇంటికి వెళ్లగానే అక్కడి
మతపెద్దలు- ఆ మందులు మానెయ్యండి,
మనం ప్రార్థన చేస్తే అన్నీ సర్దుకుంటాయని
చెప్పి వాళ్ల చేత ఇన్సులిన్
మాన్పించేశారు. దాంతో ఆ పిల్లాడికి
రక్తంలో గ్లూకోజు స్థాయులు
విపరీతంగా పెరిగిపోయాయి. చివరికి
కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితుల్లో
మళ్లీ మా దగ్గరకు తెచ్చారు.
బాబును కాపాడటానికి చాలా కష్టాలు
పడాల్సి వచ్చింది. కాబట్టి ఎవరో
మత పెద్దలు, మత ప్రచార సంస్థలు,
ధ్యాన కేంద్రాలు, యోగ సమాజాల
మాటలు నమ్మి మధుమేహం మందులు
మానెయ్యటం వంటివేమీ చెయ్యొద్దు.
మతపెద్దలు, ధ్యాన గురువులు కూడా-
ప్రార్థనలు, ధ్యానాలు చెయ్యమని
చెప్పొచ్చుగానీ... ‘మందులు మానేసి’
వాటిని చెయ్యాలని మాత్రం ప్రోత్సహించొద్దు.
మందులు వాడుకుంటూ, ఎలాంటి ప్రార్థనలు,
పూజలు, ధ్యానాలు చేసినా ఇబ్బంది
లేదు.
మధ్య
తరగతి మొహమాటాలొద్దు!
మిగతా
అన్ని సమస్యల్లాగే మధుమేహం
విషయంలో కూడా మధ్యతరగతి ప్రజలు
లేనిపోని మొహమాటాలకు, దాపరికాలకు,
అపోహలకు పోయి చాలా నష్టపోతున్నారు.
ఎలాగో చూద్దాం. పేద ప్రజలు ఆర్థికంగా
ఇబ్బందులున్నా ఎంతోకొంత వైద్యులు
చెప్పింది వినాలన్న ధ్యాస, దానిపై
శ్రద్ధ చూపిస్తున్నారు. అలాగే
సంపన్న వర్గాలకు వచ్చేసరికి-
వాళ్లకు డబ్బు ఉంటుంది, చదువుకున్న
వాళ్లు కూడా కావటంతో వ్యాధి
పట్ల అవగాహన పెంచుకుంటున్నారు.
ఎటొచ్చీ మధ్యతరగతి వారే చాలా
గందరగోళాలకు లోనవుతున్నారు.
మధుమేహం వచ్చిందంటే అంతా ఏమనుకుంటారో,
తమను చిన్నచూపు చూస్తారేమోనని
దాపరికాలకు పోవటం; ఎవరేం చెప్పినా
వినటం; మందుల పట్ల, ఇన్సులిన్
పట్ల రకరకాల అపోహలు పెంచుకుని
చిట్కా వైద్యాలకు మారటం వంటివన్నీ
చేస్తూ చేజేతులా సమస్యలు కొని
తెచ్చుకుంటున్నారు. అపోహల వల్ల
మన సమాజంలో కొందరు తమకు ‘మధుమేహం
వచ్చిందని’ బయటకు చెప్పుకోవాలంటేనే
ఇబ్బందికర వాతావరణం నెలకొంటోంది.
ముఖ్యంగా పెళ్లి కావాల్సిన
ఆడపిల్లల వంటివారు చాలా ఇక్కట్ల
పాలవుతున్నారు. కొద్దికాలం
క్రితం ఓ 25 ఏళ్ల అమ్మాయి మా దగ్గరకు
వచ్చింది. బాగా చదువుకుంది,
టీచర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది.
అంతలో మధుమేహం బయటపడింది. కొంతకాలం
ఇన్సులిన్ ఇంజక్షన్లు తప్పనిసరి
అని చెప్పాం. మొదలుపెట్టిందిగానీ
అంతలోనే ఆమెకు పెళ్లి కుదిరింది.
పెళ్లి తప్పిపోతుందేమోనన్న
భయంతో మధుమేహం ఉన్న విషయం దాచిపెట్టి
పెళ్లి చేశారు. దీంతో అత్తగారింట్లో
ఆమె ఇన్సులిన్ తీసుకోవటం చాలా
కష్టమైంది. ఇన్సులిన్ బుడ్డీలు
కొనుక్కోవటం, వాటిని ఎవరికీ
తెలియకుండా దాచుకోవటం, రోజూ
ఎవరూ చూడకుండా బాత్రూమ్‌లోకి
వెళ్లి ఇంజక్షన్ తీసుకోవటం
వంటివన్నీ కష్టమైపోయి ఆమె కొద్దికాలానికే
ఇన్సులిన్ మానేసింది. దీంతో
ఆమెకు మధుమేహం నియంత్రణ తప్పింది.
ఫలితంగా ఆ తర్వాత కాలంలో ఆమెకు
4 సార్లు గర్భస్రావాలైపోయాయి.
రక్తంలో గ్లూకోజు అదుపులో లేకపోవటం
మూలంగా గర్భం వచ్చినా నిలబడలేదు.
నిజానికి చిన్న వయసు వారికి
కూడా మధుమేహం రావటమన్నది ఇప్పుడు
సర్వసాధారణం. దానికి ఇన్సులిన్
ఇంజక్షన్ తీసుకోవటం పెద్ద
సమస్యేం కాదు. ఈ విషయాలు బయటకు
చెప్పుకుంటే వేరేగా చూస్తారేమోనని
భయపడాల్సిన పనీ లేదు. వివాహాల
విషయంలో కూడా- మధుమేహం ఉన్న
ఆడపిల్లల విషయంలో ఎలాంటి అపోహలూ
పెట్టుకోవాల్సిన పని లేదు. మధుమేహాన్ని
నియంత్రణలో ఉంచుకోవటానికి
ఇప్పుడు ఇన్సులిన్‌తో సహా సమర్థమైన
మందులున్నాయి. దాన్ని నియంత్రణలో
పెట్టుకుంటే దాంపత్య జీవితం
విషయంలోగానీ, సంతానం విషయంలోగానీ
ఎలాంటి సమస్యలూ ఉండవు. మధ్యతరగతి
వారు ఇలాంటి అనుమానాల్లోంచి
బయటపడాల్సిన అవసరం చాలా ఉంది.
అలాగే మందుల కంటే పసర్లు, కషాయాలు,
పొడుల వంటివే ఉత్తమమనీ, వాటితో
దుష్ప్రభావాలు ఉండవనీ.. ఇలాంటి
అపోహల నుంచి బయటపడటం మంచిది.
గ్లూకోజు
ఒక్కటీ చూస్తే చాలదు!
చాలామంది
మధుమేహులు రక్తంలో గ్లూకోజు
ఒక్కటే చూసుకుంటూ.. ట్రైగ్లిజరైడ్లు,
కొలెస్ట్రాల్, హైబీపీ వంటివేమీ
పట్టించుకోవటం లేదు. కానీ ఇది
సరికాదు.
ఎందుకంటే రక్తంలో గ్లూకోజు
నియంత్రణలోనే ఉంటున్నా కూడా
(అంటే పరగడుపున రక్తంలో గ్లూకోజు
125 కంటే తక్కువగానే ఉంటున్నా
కూడా)... వీళ్లకు రక్తంలో కొలెస్ట్రాల్,
ట్రైగ్లిజరైడ్లు, హైబీపీ వంటివి
ఎక్కువ ఉంటే మధుమేహం కారణంగా
వచ్చే దుష్ప్రభావాలన్నీ ముంచుకొచ్చే
ప్రమాదం ఉంటుంది. కాబట్టి రక్తంలో
గ్లూకోజు మాత్రమే తగ్గించుకుంటే
సరిపోదని గుర్తించాలి. నిజానికి
మధుమేహులు రక్తంలో గ్లూకోజుతో
పాటు- వూబకాయం, హైబీపీ, కొలెస్ట్రాల్,
ట్రైగ్లిజరైడ్లు.. ఈ నాలుగింటినీ
కూడా కచ్చితంగా పట్టించుకోవాల్సిందే.
వీటిలో హైబీపీ, కొలెస్ట్రాల్,
ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా
ఉంటే వాటికి కచ్చితంగా మందులు
కూడా వాడుకోవాల్సి ఉంటుంది.
కొన్నేళ్లుగా విస్తృతంగా ప్రచారం
చెయ్యటం మూలంగా మన సమాజంలో ఇటీవలి
కాలంలో కొలెస్ట్రాల్, హైబీపీల
మీద కొంత అవగాహన బాగానే పెరిగిందిగానీ
ఇప్పటికీ ట్రైగ్లిజరైడ్ల
గురించి చాలామందికి తెలియటం
లేదు. ట్రైగ్లిజరైడ్లు ఎక్కువున్నా
వాటిని అస్సలు పట్టించుకోవటం
లేదు. కానీ ట్రైగ్లిజరైడ్లనూ
చూసుకోవటం చాలా అవసరం. ట్రైగ్లిజరైడ్లు
200ల్లోపు ఉండాలి. 200లకు మించి
600 ల్లోపు ఉంటే- మందులు వాడటం
ఉత్తమం. ఇక 600 దాటితే మాత్రం ఇన్సులిన్
తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే
ట్రైగ్లిజరైడ్లను అదుపులో
ఉంచుకునేందుకు పిండి పదార్థాలను
తగ్గించాలి. అలాగని అన్నం మానెయ్యాల్సిన
పని లేదుగానీ.. తేలికగా జీర్ణమయ్యే
పిండిపదార్థాలు- అంటే బ్రెడ్లు,
బిస్కట్లు, జామ్, చిప్స్ వంటివి
మానెయ్యాలి. మద్యం కూడా ట్రైగ్లిజరైడ్లను
పెంచుతుంది. దాన్నీ మానెయ్యాలి.
మందులు వేసుకోవాలి.
No comments:
Post a Comment